విజయ దశమి శుభాకాంక్షలతో.......
తన శరీరము పట్ల వ్యామోహాన్ని, మహా మొహాన్ని కలిగిన వారై , ఇంద్రియ లోలులై, వర గర్వితులై త్రిగుణాలతోను, రాగద్వేషాలతోను, అరిషట్ వర్గాలతోను వ్యవహరిస్తూ, లోక కంఠకులై, అసుర చేష్టలతో జనులను, సాధువులను, స్త్రీలను పీడిస్తు వున్న రావణ, దుర్గమాసురాది రాక్షసుల ఫై కలిగిని విజయమే విజయదశమి.
దుర్గమము అంటే కొన్ని పర్యాయ పదాలు కోట, పురము, శరీరము, జయింప శక్యము కానిది, కఠినమయిన త్రోవ, దాట శక్యము కానిది మొదలగునవి ఆయా సందర్భాలననుసరించి వాడుతుంటారు. ఇక్కడ శరీరము అని తీసుకుంటే, ఈ శరీరము జడము, ఇది జడ ప్రకృతి, ఈ జడ ప్రకృతినే 'మాయా' అంటారు, ఈ మాయ జయింప శక్యము కానిది. జయించుటకు అతి దుర్లభమయినది, అత్యంత కఠినమయినది. జీవుడు తాను ధరించిన శరీరము పట్ల మహా మోహముతో ఉంటాడు. సత్వ రజస్తమోగుణాలతోను, 'రాగద్వేషాలతో', అరిషట్వర్గాలతోను వ్యవహరిస్తుంటాడు. ఈ విధముగా భౌతిక జగత్తుతో తాను నెరపే ప్రతి వ్యవహారమునకు కారణము తన పట్ల తనకు వున్నబంధమే, ఈ మాయయే, ఈ మోహకారణమే జన్మ పరంపరలకు దారితీస్తున్నది. కనుక ఈ విధమమయిన సంసార చక్రమును జీవుడు దాటుకోవాలంటే తన పట్ల తనకు వున్న ఆ మాయా మోహము నశించాలి, ఆ మోహము నశించటం అత్యంత దుర్లభమయిన, కఠినతరమయినదిగా వున్నది. ఈ మహా మాయ పట్ల, మాయా మోహముపట్ల కలిగిన జయమే విజయ దశమి.
ఈ కఠినమయిన, దుర్లభమయిన జయింప శక్యము కానిదిగా అగుపిస్తున్న ఈ మాయా మొహాన్ని అత్యంత సులభతరమయిన బోధ, ఆది గురువుగా ఆ పరమేశ్వరుడే సమస్త మానవాళికి అనుగ్రహించాడు. అనుకుంటా. కాశీ క్షేత్రములో కాశి విశ్వేశ్వరుని, విశ్వనాథుని దర్శించినవారు తమకు అత్యంత ప్రీతి పాత్రమయినది వదిలి వేయమంటారు. అంతే కాదు కాశీ క్షేత్రములో తనువు చాలించిన వారికి ముక్తి లభిస్తుంది అని స్థల పురాణము చెపుతుంది. ఇక్కడ తమకు అత్యంత ప్రీతి పాత్రమయినది వదిలి వేయమంటే, చాల మంది తమకు ఇష్టమయిన పండ్లు, కూరగాయలు, ఇంకా అనేకమయిన పదార్థాలు వదిలి వేస్తుంటారు, ఆలా చేస్తే ఇంద్రియ లోలత్వము నుండి బయట పడే ఒక అద్భుత సాధన అయ్యివుండవచ్చు. కానీ నా యొక్క భావనలో ఇవన్నీ కాదు, ఇక్కడ కొంత విశ్లేషించుకొంటే ప్రతి జీవికి అత్యంత ప్రీతి పాత్రమయినది ఏది అంటే తన యొక్క తనువు, తన శరీరమే ఈ జగత్తులో తనకు అత్యంత ప్రీతి పాత్రమవుతుంది. దాని పట్ల అత్యంత వ్యామోహాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ వదిలివేయడమంటే తాను ఈ శరీరము అన్న భావాన్ని వదిలి వేయడమే. నేను ఈ శరీరము కాదు అన్న శరీర భావాన్ని ఎప్పుడయితే వదిలివేస్తాడో అప్పుడే అతని అహంభావము తొలగి శుద్దుడు అవుతాడు. అతను సమస్త మానసిక బంధాలు తొలగుతాయి. ఆయా బందాలనుండి విముక్తుడ అవుతాడు. తనువుని ఆధారము చేసుకొని అనేక మానసిక బంధాలు ఏర్పడ్డాయి, అవి లత లాగ జీవుడిని అల్లుకొన్నాయి. బందితుడిని, వాటికీ కట్టు బడేటట్టుగా బద్ధుడను చేశాయి.
ఇంకా కాశీ క్షేత్రములో మరణించిన వారికి మోక్షము లభిస్తుంది అంటారు, మరణానంతరము. అయితే ఇక్కడ శరీరము ఉండగానే నేను ఈ శరీరము అన్న శరీర భావనను త్యజిస్తే, మోహము వదిలితే తన పట్ల తనకు వున్న వ్యామోహము పోతుంది. అప్పుడే సమస్త బందాలనుండి విడివడుతాడు. ఆయా బందాలనుండి ముక్తుడు అవుతాడు. బ్రతికి ఉండగానే జీవన్ ముక్తుడు అవుతాడు. విజయుడు అవుతాడు.
విజయ దశమి శుభాకాంక్షలతో......