భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దానహీనుజూచి ధనము నవ్వు
కదన భీతుజూచి కాలుడు నవ్వు
విశ్వదాభిరామ వినుర వేమ
అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ.
అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ
అన్నిజాడలుడిగి ఆనందకాముడై
నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ
నిన్ను నమ్మముక్తి నిక్కంబు నీయాన
విశ్వదాభిరామ వినురవేమ.
ఇనుము విఱిగెనేని యినుమాఱు ముమ్మాఱు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విఱిగినేని మఱియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.
కానివానితోడగలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ.